ధర్మమూర్తి రావుబహుదూరు కలవల కణ్ణన్ శ్రేష్ఠిగారు చెన్నపురిలో ధర్మసంస్థలు నెలకొల్పి శాశ్వత కీర్తినార్జించిన ధర్మమూర్తి. రావుబహుదూరు సి.కణ్ణన్ శ్రేష్ఠిగారు కలవల కుటుంబమున 1869వ సంవత్సరమున జన్మించిరి. అమరజీవులైన వారి తండ్రిగారు శ్రీ చెల్లం శ్రేష్ఠిగారు ఆ కాలమున నుండిన వర్తకులలో ప్రముఖులైయుండిరి. మిస్సర్స్ కింగ్ అండ్ కంపెనీలో వీరొక ముఖ్య భాగస్థులై యుండిరి. శ్రీ కణ్ణన్ శ్రేష్ఠిగారు చెన్నపురిలోని పచ్చయప్ప కళాశాలలోను, క్రైస్తవ కళాశాలలోను విద్యనార్జించి తమ తండ్రిగారి వృత్తినవలంభించి, దానిని మిక్కిలి ప్రయాసపడి పెంపొందించిన దానిఫలితముగా కింగ్ అండ్ కంపెనీకి నేడు చెన్నపురిలో మిక్కిలి పలుకుబడి, గౌరవము నేర్పడియున్నది. కేవలము ధనార్జనమునందే దృష్టికలవారుగా నుండక వారు దానిని పలుధర్మమార్గములలో వ్యయము చేయుచుండుట ఎల్లరకు విదితమే. ఆ మహనీయుని ప్రశంసింపని వారులేరు. సాధారణముగా ధనవంతులు బీదలకు విద్యనేర్పుటకును వైద్యవసతి కల్పింపను సహాయమొనర్పవచ్చును.
ఈ పైరెండు మార్గములలోను శ్రీ శ్రేష్ఠిగారు ధనమును ధనముగా జూడక అది అచేతనమైనదనియు తమ వెంట రాబోదనియు దలంచి దానిని తృణముగా భావించి పలు ధర్మములకును వెదజల్లియున్నారు. మదరాసులోని ఇతర స్థలములందును వారునడుపుచున్న ధర్మస్థాపనములకై ప్రతిసంవత్సరము, ఏబదివేల రూపాయలకధికముగా వ్యయమొనర్చుచున్నారు. సంస్కృతమున వారికి విశేషపరిచయము లేకున్ననూ ప్రాచీన గ్రంధములను పలువురు తెలిసికొని మేలందుకొనిటకై తిరువల్లిక్కైణిలో నొకసంసృత కళాశాల నేర్పరచి దానికై నెలకు రూ.450 వ్యయము చేయుచున్నారు.
ఆ మహనీయుని ధర్మకైంకర్యములందు చింతాద్రిపేటలో ఒక బాలికా పాఠశాలయు, నారాయణ మొదలివీధిలోనొక బాలికా పాఠశాలయు, తంబుచెట్టి వీధిలో ఒక బాలికా పాఠశాలయు నడుపబడుచున్నవి. తిరువళ్ళూరిలోని ఉన్నతోన్నత పాఠశాలయు, మాంబళములోని పాఠశాలయు వారివలన నెలకొల్పబడినవి. నీడామంగ లములోని పాఠశాలకు వారు ఆర్ధిక సహాయమొనర్చుచున్నారు. మదరాసులోను, తక్కిన చోటులలోను బీదలకై వారు ఏర్పరచియున్న ప్రాధమిక పాఠశాలను లెక్కింప నలవిగానివి.
రెండవ పేజీ..
సంఘసేవలోను వారు విశేషించి పాల్గొని పాటుపడుచుండుట ప్రసిద్ధమైనదే. దక్షిణ భారత వ్యాపార సంఘమున వారొక సభ్యులు. ఇండియన్ బ్యాంక్ లో వారొక డైరెక్టరు. పప్పు చెట్టిగారి ధర్మసంస్థలకు వారు అధ్యక్షులు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్ధానమునకు వారొక ధర్మకర్తలు. మైలాపూరు సంగీత సభకు అధ్యక్షులు. పెన్సిలు కర్మాగారమున నొకభాగస్థులు. వైశ్యుల సంఘమునకు వారధ్యక్షులు. తిరువల్లిక్కేణి హిందూ హైస్కూలు కార్యనిర్వాహక సంఘమున వారొకసభ్యులు. యువజన విద్యాసంఘమునకు వారభిమానులు. ఆర్య అంజుమాన్ లో వారొక డైరెక్టరు. పింజరు పోలులో వారు గౌరవ కోశాధ్యక్షులు. మృగసంరక్షణ సంఘమునజేరినవారు. మదరాసు సంఘసేవా సంస్థకును వారు విశేష సహాయ మొనర్చుచుండుటతోబాటు దాని ఉపాధ్యక్షులలో నొకరుగానున్నారు. చెన్నపురిలోని విద్యార్ధుల శ్రేయమునుద్దేశించి వారొక గ్రంధాలయమును నెలకొల్పియున్నారు.
తిరువల్లిక్కేణిలో ఒక ఆయుర్వేద వైద్యశాలను, నెల్లూరిలోను, నుంగంబాక్కం లోను ఆయుర్వేద వైద్యశాలలను నెలకొల్పి నడుపుచున్నారు. చెన్నపురిలో శిశువులకు కల్తీలేని పాలు దుర్లభముగ నుండుటకు వగచి బిడ్డలకు పాలువినియోగింప వేర్పాటుచేసియున్నారు. బీద బాలురు పలువురకు అన్నదాన మొనర్చుచున్నారు. మైలాపూరులోని రామకృష్ణ మఠమునకు సంవత్సరమునకు రూ.240 యిచ్చుచున్నారు.
తిరువళ్ళిక్కేణిలో అన్నదాన సమాజమునకు రూ.8000/- వ్యయముతో నొకప్రత్యేక భవనమును నిర్మించియున్నారు. ప్రతిదినమునందు వేలకొలది ప్రజలకు అన్నదాన మొనర్పబడుచున్నది. బీదవిద్యార్ధులకు వేతనములనిచ్చి తోడ్పడుచున్నారు. వ్యాపారాభివృద్ధి శ్రద్ధవహించిన యిరువురు బాలురకు ప్రత్యేకముగ విద్యార్ధి వేతనములిచ్చి బొంబాయికి పంపియున్నారు. కృష్ణప్పనాయకన్ వీధిలో ఆదివారమున వేలకొలది యాచకులకు అన్నదాన మొనర్చుచున్నారు. ఎగ్మూరులో ప్రయాణికులకు తగిన బసలేక యల్లడుటను జూచి రూ.72 వేల వ్యయములో నొకసత్రమును నిర్మించియున్నారు.
ఇట్టి ధర్మచింత పరులైన మహనీయులకు తిరువళ్ళిక్కేణి పౌరులు "ధర్మమూర్తి" యను బిరుదము నొసంగి ప్రశంసించి యుండుటలో నాశ్చర్యము లేదు. రాజకీయమునందు వారు విశేషించి పాల్గొని దేశాభివృద్ధికి పాటుపడుచున్నారు. గడచిన సంవత్సరమున కాంచీపురమున జరిగిన కన్ఫరెన్సున, ఆహ్వాన సంఘాధ్యక్షులుగ నుండి వారుగావించిన అరుదైన ప్రసంగము వెవ్వరును విస్మరింపజాలరు. (ఇటీవల) మదరాసు కార్పోరేషనులోను వారు స్ధానము బడసియున్నారు. ఈ శ్రీమంతులు చాలాకాలము వెలసియుండి వారి ధర్మములు శాశ్వతముగా దినదినాభివృద్ధి నందుచు వెలసియుండునట్లు సర్వశక్తుడగు భగవంతుడనుగ్రహించునుగాక.
మొదటి పేజీ..